చాలా రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ల వివాదం కొనసాగుతోంది. ఏ, బీ, సీ సెంటర్ లలో టికెట్ల ధరలపై సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరల అంత తక్కువగా ఉంటే సినిమాలు నడపడం చాలా కష్టమని వాపోతున్నారు. రీజనబుల్ గా టికెట్ల రేట్లను నిర్ణయించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. అయితే.. ఏ.పీ సర్కారు మాత్రం టికెట్ ధరలను మరో సారి మార్చేది లేదని తేల్చి చెబుతోంది. సామాన్య ప్రజలకు వినోదాన్ని దూరం చేయాలనుకోవడం లేదని అంటోంది. తాము నిర్ణయించిన ధరలతోనే సినిమాలు ప్రదర్శితం కావాలని చెబుతోంది.
అయితే.. ఇప్పుడు ఈ వివాదానికి తెరపడనుందని తెలుస్తోంది. ఈనెల పదో తేదీ తర్వాత క్లారిటీ వస్తుందని అంటున్నారు. టికెట్ల ధరల వివాదంతో పాటు.. టాలీవుడ్ పెద్దల మధ్య ఉన్న గ్యాప్ కూడా తగ్గనుందని.. టికెట్ల ధరలను తమకు ఇష్టమున్న ధర నిర్ణయించుకోవచ్చని చెబుతున్నారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగతంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ ఇంటికి వెళ్లి కలిశారు. లంచ్ సమయంలో ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మీటింగ్ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ల రేట్లు సహా అన్నింటిని చిరంజీవి సీ.ఎం జగన్‌కు వివరించారని ప్రచారం ఉంది. తాజాగా మరో సారి ముఖ్య మంత్రి జగన్ ను చిరంజీవి కలవనున్నట్లు సమాచారం. అయితే ఈసారి మెగాస్టార్ ఒక్కరే కాకుండా ముఖ్యమంత్రిని కలిసే వారి లిస్ట్‌లో పరిశ్రమ పెద్దలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరి సమావేశంలో జగన్ తన నిర్ణయాన్ని చెబుతారని అనుకుంటున్నారు. సీఎంతో భేటీ నేపథ్యంలో ఏయే విషయాలు చర్చించాలి. ఏయే డిమాండ్లను జగన్ ముందు ఉంచాలనేది నిర్ణయించడానికి ఇండస్ట్రీ పెద్దలు సమావేశం కావడానికి సిద్ధం అవుతున్నారు. అంతా ఒకే తాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం బెటర్ అని అనుకుంటున్నారు. రేపే పరిశ్రమ పెద్దలు కలవనున్నారు. స్టార్ హీరోలతో పాటు.. దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భేటీ కానున్నారు.