మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్యను కొరటాల శివ తెరకెక్కిస్తున్నవిషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. కరోనా కారణంగా సినిమా ఆగిపోయింది. లేదంటే ఇప్పటి వరకు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కేవలం వంద రోజుల్లో సినిమాను తీస్తానంటూ కొరటల మరీ మరీ ఛాలెంజ్ చేశాడు. కాని కరోనాతో మొత్తం క్యాన్సిల్ అయ్యింది.
రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల అయిన వెంటనే ఈ కథ నాది అంటే నాది అంటూ మీడియా ముందుకు ఇద్దరు వచ్చారు. వారిలో రాజేష్ అనే వ్యక్తి కథ విషయంలో చాలా పట్టుబడుతున్నాడు. మైత్రి మూవీస్ వారికి ఈ కథ చెప్పగా వారు కొరటాల శివకు కథ ఇచ్చి చిరంజీవితో చేయిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు.
ఈ కథ విషయంలో వస్తున్న ఆరోపణలను మైత్రి మూవీస్ వారు కొట్టి పారేశారు. కొరటాల శివ కూడా తన కథ గురించి కొందరు చేస్తున్న విమర్శలను కొట్టి పారేశాడు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఖచ్చితంగా లీగల్ చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించిన విషయం తెల్సిందే. అయినా కూడా ఆ రచయిత రాజేష్ మండూరి మాత్రం వరుసగా ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్నాడు.
చిరంజీవిని కలిసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో కోర్టుకు వెళ్లేందుకు సిద్దం అయ్యాడు. దాంతో సినిమా విడుదలకు కోర్టు స్టే ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే ఆచార్యకు ఇప్పటికే జరిగిన నష్టం కాకుండా ఇంకా చాలా నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.