మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా మెగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. సక్సెస్ఫుల్ కెరీర్ కొనసాగిస్తూ ..సినిమా సినిమాకు తన పరిణితి పెంచుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ తో పాటు చిరంజీవి- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు.
లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇందులో చెర్రీ క్యారెక్టర్, మేకోవర్ గురించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయే నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ ప్రిపేర్ అవుతున్నాడు. చాలా ఎమోషనల్‌గా ఉండే ఈ కారెక్టర్ సినిమాలో 30 నిమిషాలకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. దీనికోసం భారీగా పారితోషికం అందుకుంటున్నాడు మెగా పవర్ స్టార్.
కొరటాల శివపై ఉన్న నమ్మకం.. తండ్రి సినిమా కావడంతో ఈ సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నాడు రామ్ చరణ్. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఈ పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందని.. ముఖ్యంగా కథలో చరణ్ పాత్ర మరో స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. చరణ్ ఉండే 30 నిమిషాల్లో దాదాపు 22 నిమిషాల పాటు చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్ జోడీగా రష్మిక మందన్న కనిపించబోతుంది. ఇంటర్వెల్‌కు ముందు రామ్ చరణ్ పాత్ర వస్తుందని తెలుస్తుంది.