తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో అనుకున్నదే అవుతుంది. మోనాల్ విషయంలో ఏదో ఒక రోజు అభిజిత్ మరియు అఖిల్ లు గొడవ పడటం ఖాయం అంటూ సోషల్ మీడియాలో చాలా రోజులుగా అంతా అనుకుంటున్నారు. అందరు అనుకుంటున్నట్లుగానే జరిగింది. ఇద్దరు కూడా నామినేషన్ పక్రియ సందర్బంగా మోనాల్ టాపిక్ తీసుకు వచ్చి ఢీ అంటే ఢీ అన్నట్లుగా గొడవ పడ్డారు.
నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో ఆ విషయాన్ని చూపించారు. నేడు ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ జరిగింది. అఖిల్ ను నామినేట్ చేసిన అభిజిత్ ఆ సందర్బంగా చెప్పిన కారణాలతో గొడవ మొదలు అయ్యింది. వేలు చూపించి మాట్లాడొద్దు అంటూ అఖిల్ కాస్త కోపంగా అభిజిత్ కు హెచ్చరించాడు. అదే సమయంలో అభిజిత్ కూడా తాను అదే చెపుతున్నాను. ఎప్పుడు నువ్వు వేలు చూపించి మాట్లాడుతున్నావు అంటూ అంతే కోపంతో సీరియస్ అయ్యాడు. మొత్తానికి ఇద్దరు కూడా రచ్చ రచ్చగా గొడవ చేశారు.
మోనాల్ విషయంలో నీ మాట నాకు నచ్చలేదు. నీవు ఆమె తో మాట్లాడింది బయట ఎలా ప్రచారం జరుగుతుందో ఊహించుకో అంటూ అఖిల్ హెచ్చరించగా నేను ఆమె తో మాట్లాడితే నీకు ఏంటీ అంటూ అభిజిత్ ప్రశ్నించాడు. మొత్తానికి ఇద్దరు కూడా మోనాల్ విషయంలో తీవ్రంగా గొడవ పడుతున్న సమయంలో ఆమె కన్నీరు పెట్టుకుంది. మోనాల్ విషయంలో ఇద్దరు పడ్డ గొడవ పీక్స్ కు వెళ్లింది. మీరు ఇద్దరు నా పేరు తేవాల్సిన అవసరం లేదు అంటూ మోనాల్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. నేటి ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగబోతుంది అని ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది.