అక్కినేని హీరో అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. ఆ మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న అఖిల్ వరుసగా మూడు సినిమాలు నిరాశ పర్చడంతో పాటు నాల్గవ సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కూడా పెద్దగా అంచనాలు లేకుండానే తెరకెక్కుతోంది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న బ్యాచిలర్ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. త్వరలోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా ఎటాక్ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేదు. వచ్చే ఏడాది వరకు సినిమా విడుదల అయ్యే అవకాశం లేదు అనిపిస్తుంది.
ఇలాంటి సమయంలో అక్కినేని అఖిల్ అయిదవ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ విషయాన్ని రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర నిర్మించబోతున్నాడు. రేపు ఈ సినిమా గురించి ప్రకటించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. రేపు అనగా 9వ నెల 9వ తారీకున 9 గంటల 9 నిమిషాల 9 సెకన్లకు సినిమాను ప్రకటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
సురేందర్ రెడ్డి సైరా సినిమా తర్వాత ఇప్పటి వరకు తదుపరి చిత్రంను మొదలు పెట్టలేదు. ఎట్టకేలకు అఖిల్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు. కిక్ వంటి సూపర్ హిట్ ఎంటర్టైనర్ను అఖిల్‌తో సురేందర్ రెడ్డి చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సైరా సినిమాతో నిరాశ పర్చిన సురేందర్ రెడ్డి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.