ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూసుకుపోతున్నాడు. ఇటీవల విడుదలైన పుష్ప చిత్రంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో పలు వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. అది అతడి నోటి దురుసుతోనో లేదా ఆయన చేతలతోనో కాదు. తను చేసే యాడ్స్ తో. జొమాటోకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న అల్లు అర్జున్.. ఆ సంస్థకు చేసిన ఆ యాడ్ తాజా వివాదానికి దారి తీసింది.
ఆ మధ్య ఓ బైక్ ట్యాక్సీ యాప్ కోసం అల్లు అర్జున్ యాడ్ చేశాడు. అయితే, ఆ యాడ్ కాస్తా తెలంగాణ ఆర్టీసీని కించపరిచేలా ఉందని విమర్శలు వచ్చాయి. ఏకంగా టీ.ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఈ యాడ్‌పై స్పందించారు. యాడ్ చేసుకోవడం, తమ సర్వీస్‌ను ప్రమోట్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, కానీ అది ప్రభుత్వ రంగ సంస్థలను కించపరిచేలా ఉండకూడదని క్లాస్ పీకాడు. యాడ్‌లో అభ్యంతరంగా ఉన్న వ్యాఖ్యలను తీసెయ్యాలని నోటీసు కూడా ఇవ్వడంతో.. ఆ బైక్ ట్యాక్సీ యాప్ చర్యలు చేపట్టింది. అప్పటికప్పుడు ఆ యాడ్‌లోని వివాదాస్పద కంటెంట్‌ను తొలగించింది.
తాజాగా బన్నీ జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ కోసం ఓ కమర్షియర్ యాడ్ చేశాడు. ప్రస్తుతం అది తెగ వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ జొమాటో యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అందుకోసం ఇటీవలే ఓ భారీ ఒప్పందం కూడా చేసుకున్నాడు స్టైలిష్ స్టార్. దీని కోసం ఓ యాడ్ చేశాడు బన్నీ. ఇందులో నటుడు సుబ్బరాజు కూడా నటించాడు.
ఇక యాడ్ విషయానికి వస్తే.. తనను కొట్టడానికి వచ్చిన సుబ్బరాజును బన్నీ ఒక పంచ్ ఇచ్చి పైకి లేపుతాడు. సుబ్బరాజు గాల్లో తేలుతూ ఉంటాడు. నన్ను కొంచెం కిందపడేయవా.. అని సుబ్బరాజు అడిగితే.. సౌత్ సినిమా కదా ఎక్కువ సేపు ఎగరాలి.. అని అర్జున్ అంటాడు. గోంగూర మటన్ తినాలని ఉంది. కిందకి వచ్చే లోపు రెస్టారెంట్ మూసేస్తారు అని సుబ్బరాజు అంటుంటే.. గోంగూర మటన్ ఏంటీ ఎప్పుడు ఏది కావాలన్నా జొమాటో ఉందిగా.. అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ సౌత్ సినీ ఇండస్ట్రీలను కించపరిచాడంటూ సినీ అభిమానులను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.