సూపర్ స్టార్ రజనీకాంత్ అపోలో హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. శుక్రవారం హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన రజని ..ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని అపోలో వైద్య బృందం తెలిపింది. రక్తపోటులో హెచ్చతగ్గుల వల్లే రజినీ అనారోగ్యానికి గురయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఆ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, రక్తపోటు నియంత్రణకు కృషి చేస్తున్నట్టు చెప్పుకున్నారు. రజనీకాంత్‌కు నేడు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని , మరో రెండ్రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని బులిటిన్ లో తెలిపారు.
పది రోజుల క్రితం రజనీకాంత్ తన కొత్త చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చారు. కాగా చిత్ర యూనిట్ లో 8 మందికి కరోనా సోకడం తో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. రజిని సైతం కరోనా టెస్ట్ చేసుకోగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో రజనీకాంత్ చేరారు.