ఓ పక్క హీరోగా రాణిస్తూనే మరోపక్క బిజినెస్ లు చూసుకుంటున్న యంగ్ హీరో సందీప్ కిషన్..ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. తాజాగా కమెడియన్ సత్య తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. దీనికి తన బిజినెస్ రెస్టారెంట్ పేరునే పెట్టడం విశేషం. ఈ మధ్యనే సందీప్ ‘వివాహ భోజనంబు’ పేరుతో హైదరాబాద్ నగరంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రెస్టారెంట్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. ఇప్పుడు ‘వివాహ భోజనంబు’ పేరుతో సందీప్ సత్య ను హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మిస్తున్నారు.
శుక్రవారం ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. టాలీవుడ్ ఫస్ట్ లాక్డౌన్ వెడ్డింగ్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. పిసినారి మహేష్ పెళ్లి చేసుకోగానే లాక్డౌన్ ప్రకటించడం, బంధువులతో నిండిపోయిన ఇంట్లో కొత్త జంటకు ప్రైవసీ దొరక్క ఇబ్బంది పడడం వంటి అంశాలు హైలెట్‌గా ఉన్నాయి. టీజర్ చివర్లో సందీప్ కిషన్ నెల్లూరు ప్రభగా కనిపించి ట్విస్ట్ ఇచ్చారు.
ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సమర్పణలో.. వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందతున్న ‘వివాహ భోజనంబు’ చిత్రానికి సందీప్, శినీష్ నిర్మాతలు. రామ్ అబ్బరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.