ప్రభాస్ .. ఓంరావత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా..సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ సినిమా భారతీయ పురాణం, ఇతిహాసమైన రామాయణం ఆధారంగా తెరకెక్కబోతుంది. అయితే కొన్ని రోజుల క్రితం సైఫ్ మీడియా తో మాట్లాడుతూ సినిమా లైన్ గురించి చెప్పి వివాదానికి తెరలేపాడు.
‘రాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయమే. రావణుడిలో ఉన్న మానవీయ కోణాన్ని ‘ఆదిపురుష్’లో చూపించబోతున్నాం` అని సైఫ్ చెప్పడం తో పెద్ద దుమారమే చెలరేగింది. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో తన వ్యాఖ్యాలపై సైఫ్ వెంటనే క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది జౌన్పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సైఫ్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ‘ఆదిపురుష్’ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తం మీద సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళాక ముందే వివాదాల్లో చిక్కుకుంటుంది. మరి సెట్స్ పైకి వచ్చాక , రిలీజ్ తర్వాత ఇంకెన్ని చిక్కులు పడుతుందో చూడాలి.