తమిళ్ ఇండస్ట్రీ లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘పాండియన్ స్టోర్’లో ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి వి.జె.చిత్ర(28) ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని నజరేత్‌పేట్‌లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసిన చిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈమె ఆత్మహత్య వెనుక పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. చిత్ర ఆత్మహత్య చేసుకుందని పోస్టుమార్టం రిపోర్టులో తేలినా… ఆమె తల్లిదండ్రులు, బంధువులు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. తమ కూతురిని అల్లుడే తీవ్రంగా కొట్టి చంపేశాడని చిత్ర తల్లి విజయ ఆరోపిస్తున్నారు.
రోజూ తిరువాన్మియూరులోని ఇంటి నుంచే షూటింగ్‌కు వెళ్లే చిత్ర.. నాలుగు రోజులుగా హోటల్లో భర్తతో కలిసి హోటల్లో ఎందుకు ఉంది?, ఆమె మొహంపై గాయాలు ఎందుకున్నాయి?, పెద్దల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించి, పెళ్లికి ముహూర్తం నిశ్చయించినా.. హేమంత్ .. చిత్రను తొందరపెట్టి రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడు..? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చిత్రతో సన్నిహితంగా ఉండే నటీనటులు, ఫ్రెండ్స్‌తో పాటు.. పాండియన్ స్టోర్స్ యూనిట్‌ను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.