నువ్వా..నేనా అన్నట్లు గ్రేటర్ ఎన్నికల ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. నాయకులు ఎక్కడికి వెళ్లిన ప్రజలు బ్రహ్మ రధం పట్టారు. కానీ పోలింగ్ బూత్ లలో మాత్రం పట్టుమని పది మంది కూడా లేకుండా పోయింది. మంగళవారం జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక వెలవెల బోయాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు కేవలం 25 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు భారీఎత్తున ప్రచారం చేసినా నగర ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. చాలా చోట్ల పోలింగ్ సిబ్బంది, పోలీసులు తప్ప ఓటర్లు కనిపించడం లేదు. మధ్యాహ్నం దాటిన ఓటర్లు రాకపోవడంతో ఓ పోలింగ్ కేంద్రంలో సిబ్బంది నిద్ర కూడా పోవడం జరిగింది. పోలింగ్ తగ్గడానికి ఆ నలుగురే కారణం అంటూ తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఈసీ నిర్లక్ష్యం వల్ల పోలింగ్ శాతం తగ్గిందని ఆరోపించారు. ఓటింగ్ శాతం తగ్గించడానికి కుట్ర జరిగిందన్నారు. సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని తేలడంతోనే టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేసిందని ఆయన ఆరోపించారు. ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఓటింగ్ శాతం తగ్గించాయని ఆరోపించారు. ఇంత ఘోర పరిస్థితి ప్రజస్వామ్య దేశంలో ఎక్కడా జరగలేదన్నారు.