రవితేజ – గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. వరుస ప్లాఫుల్లో ఉన్న రవితేజ… తనకు డాన్ శీను, బలుపు.. లాంటి హిట్లు అందించిన గోపీచంద్‌పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనుకుంటున్న తరుణంలో ఈ చిత్రం వివాదంలో చిక్కుకోవడం అందర్నీ అయోమయంలో పడేసింది. 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తుండగా ఓ తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ సంస్థ షాకిచ్చింది.
‘క్రాక్’ సినిమా విడుదల ఆపేయాలంటూ ఓ తమిళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కోర్ట్ మెట్లు ఎక్కింది. ‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధు తమిళంలో విశాల్ హీరోగా ‘టెంపర్’ మూవీని రీమేక్ చేశాడు. అయితే ఆశించినంత విజయం సాధించలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్ల నష్టపోయారు. నష్టాలను తాను భరిస్తానని ఠాగూర్ మధు ముందుగా డిస్ట్రిబ్యూటర్లకు అగ్రిమెంట్ రాసిచ్చారట. తమకు న్యాయం జరిగేవరకు మధు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘క్రాక్’ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని ఆ డిస్ట్రిబ్యూటర్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందట. సినిమా విడుదలపై ఈ ఎఫెక్ట్ చూపే అవకాశం ఎంతైనా ఉందని అంత అంటున్నారు. ఒకవేళ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే ఆ డబ్బును నిర్మాత చెల్లించాల్సి ఉంటుంది. మరి మధు ఏంచేస్తాడో చూడాలి.