దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర హోంశాఖ ఆన్ లాక్ లో భాగంగా మరిన్ని మినహాయింపులతో మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిచ్చింది. కానీ తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ మాత్రం థియేటర్స్ ఓపెన్ చేసేందుకు సాహసం చేయలేకపోయారు. కరోనా నేపథ్యంలో థియేటర్స్ ఓపెన్ చేస్తే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారో..రారో అని అలాగే ఉండిపోయారు.
తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ రాష్ర్టంలోని సినిమా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన అనుమతులకు ప్రభుత్వం స్వల్ప మార్పులు చేస్తూ మంగళవారం తాజాగా ఆదేశాలు జారీచేసింది. సోషల్, అకాడమిక్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, కల్చర్, రిలీజియస్, పొలిటికల్ ఫంక్షన్స్‌తో పాటు ఇతర సమావేశాలకు కంటైన్మెంట్ ప్రాంతాలకు ఆవల 100 మంది వ్యక్తుల పరిమితితో ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంఖ్య 100 కి మించితే ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తూ సంబంధిత వ్యక్తుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది.
మూసి ఉన్న ప్రదేశాల్లోనైతే హాల్ సామర్థ్యంలో 50 శాతం వరకు పరిమితి ఇచ్చింది. 200 మంది వరకు అనుమతి. ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించడం తప్పనిసరిగా పాటించాలంది. తాజాగా ప్రభుత్వ అనుమతులతో థియేటర్స్ ఓపెన్ చేసే విషయమై ఎగ్జిబిటర్లు ఆలోచన చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 1వ తేదీ నుంచి రాష్ర్టంలో కూడా థియేటర్స్ ఓపెన్ అవ్వొచ్చని తెలుస్తుంది. దీనిపై అతి త్వరలోనే స్పష్టత వస్తుంది.