యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల మంచి స్నేహితులని చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి చాల సినిమాల్లో నటించారు. స్టూడెంట్ నెం 1 తో మొదలైన వీరి సినిమాలు ..మొన్నటి జనతా గ్యారేజ్ వరకు సాగుతూనే ఉంది. అయితే ఎన్టీఆర్ తో స్నేహం ఎలా మొదలైందనే విషయాలని రాజీవ్ తాజాగా తెలిపారు.
‘స్టూడెంట్ నెంబర్ 1’ షూటింగ్‌లో ఫస్ట్ డే గొడవతో తమ పరిచయం మొదలైందని రాజీవ్ చెప్పారు. ‘‘ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నాం. ఫస్ట్ సీన్ రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు. మెట్లపై భయ్యా భయ్యా అంటూ ఎన్టీఆర్ వచ్చే సీన్. మధ్యాహ్నం లేస్ గార్డెన్ దగ్గర షూటింగ్‌కు వెళ్లాం. సినిమా వారపత్రికలో పుస్తకం పెట్టుకుని ఎన్టీఆర్ చదువుతూ ఉంటాడు. ఆ సీక్వెన్స్ చేస్తున్నాం. ఆర్టిస్ట్ చంద్రశేఖర్ (గెడ్డం శేఖర్) ఒక కళ్లజోడు కొనుక్కొని తెచ్చుకున్నాడు. సికింద్రాబాద్‌లో 80, 90 రూపాయలకు దొరికే కళ్లజోడు అది.
ఆ కళ్లజోడు నా క్యారెక్టర్‌కు సరిపోతుందేమోనని శేఖర్‌ను అడిగి తీసి పెట్టుకున్నాను. ఎదురుగా కూర్చున్న ఎన్టీఆర్.. ‘ఛ, కళ్లజోడు అవసరమా’ అన్నాడు. నన్నే అంటాడా? అనుకున్నాను. ఆ అవసరం, అందుకే పెట్టుకున్నాను అని అన్నాను. నాకు అర్థమైపోయింది. ఇంకేదో కెలుకుతాడు అనిపించింది. ఆరోజు సాయంత్రం వెళ్లి జక్కన్నకు చెప్పేశాను. నీకు దండం పెడతాను నన్ను వదిలేయ్, రెండే సీన్లు అయ్యాయి, ఇంకెవరినైనా చూసుకో, పైగా హరికృష్ణ గారి అబ్బాయి, నేనేమో ఆగను, ఏదో ఒకటి అంటాను, వద్దు జకన్న అని అన్నాను. ఏదో సరదాగా అనుంటాడు, వదిలేయ్, అన్నీ సీరియస్‌గా తీసుకుంటావు అని జక్కన్న అన్నాడు.
ఆ తరవాత రోజు చూస్తే పూర్తిగా మారిపోయాడు, అపరిచితుడు. రాజీవ్ గారు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. మర్యాదలో ఇంకో స్థాయిలో ఉన్నాయి. ఏంటిది అని నాకు అర్థం కాలేదు. మూడో రోజు మళ్లీ ఏదో కెలికాడు. ఇక నాకు అర్థమైపోయింది.. చచ్చినట్టు నేను చేయాలి ఈ సినిమా అని. ఇక ఏం జరిగినా తప్పుకునే ఛాన్స్ లేదు. అయితే, తొలి షెడ్యూల్ అయిపోయిన తరవాత రెండో షెడ్యూల్‌కు బాగా క్లోజ్ అయ్యాం. అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదు’’ అని రాజీవ్ కనకాల వెల్లడించారు.