సోనూసూద్..ఇప్పుడు కనిపించే దేవుడయ్యాడు. వలస కార్మికుల దగ్గరి నుండి ఇప్పటివరకు ఎవరు ఏ ఆపదలో ఉన్న సరే వారు ఏ రాష్ట్రం వారైనా..ఎక్కడైనా సరే సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాడు. రిల్ లైఫ్ లో విలన్ అయితే రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయ్యాడు. ఇప్పటికే ఎంతమందికి సాయం చేసిన సోనూ..తాజాగా తన జీవిత కథను స్వయంగా రాసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన ఆటోబయోగ్రఫీకి టైటిల్ ‘I Am No Messiah’ అని పెట్టారు. అంటే ‘నేను మహానుభావుడిని కాదు’ అనే అర్థం వస్తుంది.
ఈ పుస్తకంలో కరోనా మహమ్మారి సమయంలో తన అనుభవాలను ప్రస్తావించనున్నారు. తన ఆటోబయోగ్రఫీకి ‘I Am No Messiah’ అని టైటిల్‌ను ఎంపిక చేసుకోవడం గురించి సోనూ సూద్ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు చాలా మంచి వారు. వారికి సాయం చేసినవారి పట్ల ఎంతో అభిమానం చూపిస్తారు. అందుకే ప్రేమతో నన్ను ‘మహామనిషి’గా పిలుచుకుంటున్నారు. కానీ, నేను మహానుభావుడిని కానని నేను బలంగా నమ్ముతాను. నా మనసు ఏం చెప్పిందో అదే నేను చేశాను. ఒకరికొకరు తోడుగా ఉండటం, ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది మనషులుగా మన బాధ్యత’’ అని చెప్పుకొచ్చారు. కాగా, సోనూ సూద్ తన పుస్తకాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు.