పదేళ్ల క్రితం అల్లు అర్జున్ – గుణశేఖర్ కలయికలో వరుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో..అల్లు అర్జున్ కు ఎంత బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిందో తెలియంది కాదు. ఈ సినిమా లో విలన్ గా తమిళ్ హీరో ఆర్య నటించాడు. ఈ సినిమా వల్ల పెద్దగా పేరు రాలేదు కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం దగ్గరయ్యాడు. సరిగ్గా పదేళ్ల తర్వాత మరోసారి బన్నీ తో ఫైట్ చేసేందుకు ఆర్య సిద్దమయ్యాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ 10న ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో మొదట విలన్‌గా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కానీ డేట్లు క్లాష్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి అతడు తప్పుకున్నారు. ఇక ఆ తరువాత ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ పాత్ర కోసం కోలీవుడ్ నటుడు ఆర్యతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించేందుకు ఆర్య కూడా ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మరోసారి ఆర్య – బన్నీ కలయిక అభిమానులను ఆనందపరచడం ఖాయం.