సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూరరై పోట్రు’ తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల అయ్యింది. థియేటర్స్ మూతపడడం తో ఈ చిత్రాన్ని ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్‌లో ఈరోజు (నవంబర్ 12) విడుదల అయ్యింది. అపర్ణ బాల మురళి హీరోయిన్‌గా నటించారు. ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ జీవితగాథను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రమిది. కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు ఇందులో కీలక పాత్రలో నటించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.
చాలా కాలంగా మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా తో ఆ ఆశ తీరింది. అయితే, అది డబ్బింగ్ సినిమా కావడం కొంత నిరాశ అయినా, కరోనా వేళలో ఒటీటీ బాటలో వచ్చిన ఓ మంచి చిత్రంగా ఇది నిలిచింది. ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే..
చంద్ర మహేష్ (సూర్య) అనే ఒక పైలెట్ 2003లో విమానం ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తాడు. దానకి ఏవియేషన్ అధికారులు అంగీకరించరు. అయినా సరే, ఆ అధికారులతో గొడవపడి మరీ ఆ విమానాన్ని ల్యాండ్ చేయిస్తాడు. ఇది ఎందుకు జరిగింది.. తరువాత అధికారులు చంద్ర మహేష్ పై తీసుకున్న చర్యలు ఏమిటి? దానికి అతని రియాక్షన్ ఏమిటి? అసలు ఎందుకు ఆ విమానాన్ని అత్యవసరంగా కిందికి దించాడు? ఇక ఇందులో అతని భార్య సుందరి (అప్రర్ణ), పరేష్ గోస్వామి (పరేష్ రావెల్), భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు) ఏం చేశారు అనేదే సినిమా. నిజ జీవిత కథల్ని తెరమీద చాలా చూసుంటాం. అవన్నీ ఆకట్టుకోలేదు. కారణాలు చాలా ఉండవచ్చు. ఆకట్టుకున్న కొన్నిటికి మాత్రం కారణం ఒక్కటే..నిజ జీవిత కథను తెరమీద ప్రేక్షకులకు వినోదాన్ని పంచె విధంగా అందించడమే. సరిగ్గా ఈ సినిమా కూడా అలానే వినోదాన్ని పంచుతూనే విషయాన్ని చెబుతుంది.
చిత్ర హైలైట్ విషయానికి వస్తే..ఈ సినిమా క్రెడిట్ పూర్తిగా సుధా కొంగరదే. సూర్య లాంటి హీరోతో నిజ జీవిత కథ అంటే ఏంటో బ్యాలెన్సింగ్ ఉండాలి. సూర్య ఇమేజిని హ్యాండిల్ చేయగలగాలి. ఈ రెండిటినీ సుధా కొంగర చక్కగా సమన్వయమ చేసుకున్నారు. సినిమాటిక్ గా కథను చెప్పడానికి చేసిన ప్రయత్నమే సగం విజయానికి కారణం.. ఇక సూర్య ను ఆ పాత్రలో ఒదిగిపోయెలా చేసిన స్క్రీన్ ప్లే చాలా బావుంది. కాకపొతే.. ఈ క్రమంలో సినిమా నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. కొంత తగ్గించొచ్చు అని కూడా అనిపిస్తుంది. అలాగే కెమెరామెన్ నికేత్ కెమెరా ఫ్రేమింగ్ చక్కగా కుదిరింది. డైలాగులు కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా సూర్య కు ఎట్టకేలకు హిట్ రావడం అభిమానులను సంతోష పరుస్తుంది.