100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఆయన చేసిన సినిమాలకు అంతగా ఆదరణ రాకపోవడం వల్ల ఆయన సినిమాల సంఖ్య తగ్గించాడు అంటూ టాక్ వినిపిస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన కొత్త సినిమాలు ప్రకటించాడు.
1996 లో ఆయన దర్శకత్వంలోనే వచ్చిన పెళ్లి సందడి సినిమా సూపర్ డూపర్ హిట్ ను దక్కించుకుంది. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు లాభాలను నిర్మాతలకు తెచ్చిపెట్టిందనే టాక్ ఉంది. అందుకే ఇప్పుడు అదే టైటిల్ తో రాఘవేంద్రరావు కొత్త సినిమా చేయబోతున్నాడు. పాత సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించగా ఈసారి పెళ్లిసందడి సినిమా లో ఆయన తనయుడు రోహన్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. మొత్తానికి అయితే రాఘవేంద్రరావు చాలా కాలం తర్వాత కొత్త సినిమాను ప్రకటించడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాదిలో రాఘవేంద్రరావు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆయన ఇంతకు ముందు ఎన్నో కమర్షియల్ సూపర్ హిట్ అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో హీరోలుగా పరిచయమైన వారు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన దర్శకత్వంలో రాబోతున్న కొత్త పెళ్లి సందడి సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ సినిమాను ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించబోతున్నారు. బాహుబలి నిర్మాణ సంస్థ అయిన ఆర్కా మీడియా వారు ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. మరికొన్ని రోజుల్లో సినిమా తారాగణం మరియు ఇతర విషయాలను వెళ్లడించబోతున్నట్లుగా నేడు రాఘవేంద్రరావు ప్రకటించారు.