నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న మూడవ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం వరకు పూర్తి అయినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దసరాకు విడుదల చేయాలని దర్శకుడు బోయపాటి చాలా ప్రయత్నించాడు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ దాదాపు ఏడు నెలలుగా నిలిచిపోయింది.
ఇతర సినిమాల షూటింగ్స్ ప్రారంభం అవుతున్న కారణంగా బాలకృష్ణ కూడా తమ సినిమాను మొదలు పెట్టేందుకు బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వచ్చే నెల నుండి వీరి కాంబినేషన్ సినిమా షూటింగ్ పట్టాలపైకి మళ్లీ ఎక్కబోతోంది. ఇక ఈ సినిమాలో ఒక యంగ్ హీరో నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఒక యువ ఎమ్మెల్యే పాత్రలో యువ హీరో నటించాల్సి ఉందని అది విలన్ పాత్ర అవ్వడం వల్ల పలువురు యంగ్ హీరోలు ఆ పాత్రకు నో చెప్పారని వార్తలు వచ్చాయి.
ఎట్టకేలకు ఆ పాత్రను అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర ఓకే చేసాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. అరవింద సమేత సినిమాలో నవీన్ చంద్ర విలన్ గా నటించి మెప్పించాడు. ఎన్టీఆర్ నుండి కూడా ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ కారణంగా బాలకృష్ణ సినిమాలు నవీన్ చంద్ర నటింపజేసేందుకు చర్చలు జరిపాడు అంటూ సమాచారం అందుతోంది.
బాలయ్య బోయపాటిల కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.