గత నెల 5వ తారీఖున కరోనా బారినపడ్డ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. చికిత్స సమయంలో ఆయన శ్వాసకు సంబంధించిన ఇబ్బంది రావడంతో ఐసీయూకు మార్చి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి దాదాపుగా నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటూ వచ్చింది. ఇటీవల ఆయన బాగానే ఉన్నట్లు అనిపించినా మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించింది.
కరోనా ను జయించి నెల రోజులు అయినా ఆయన ఇతర అనారోగ్య సమస్యల నుంచి మాత్రం బయటపడలేక పోయారు. నిన్న సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి వర్గాల వారు హెల్త్ బులిటెన్ విడుదల చేసి ఆందోళనకరంగా ఉంది అంటూ ప్రకటించడంతో అంతా కూడా ఆయన ఆరోగ్య విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.
నిన్న రాత్రి సమయం నుండి ఆయన మృతి చెందారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే నేడు మద్యాహ్నంకు ఆయన మృతి చెందినట్లుగా ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా లో జన్మించారు. రంగస్థల నటుడు అయిన సాంబమూర్తి తనయుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం.
అత్యధిక పాటలు పాడి రికార్డు సాధించడంతో పాటు ఐదు దశాబ్దాల పాటు 16 భాషల్లో 40 వేల పాటలు పాడిన ఆయనకు ప్రస్తుత గా గాయకుల్లో మరెవ్వరు సరిరారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మృతి తెలుగు సినిమా పరిశ్రమ కాకుండా యావత్ భారతదేశ సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ సినీ ప్రముఖులు మరియు దేశ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.