ఏపీలో గత కొంతకాలంగా సినిమా టికెట్ల ధరల వివాదం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంత మందిని దృష్టిలో పెట్టుకొని జగన్ సర్కార్ కక్ష సాధిస్తోందని చాలా మంది భావిస్తున్నారు. అందులో భాగంగానే సినిమా టికెట్ల ధరలు తగ్గించడం.. బినిఫిట్ షోలు రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందంటూ విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల బృందం సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయింది. అయితే ఈ సమావేశానికి హీరో బాలకృష్ణ వెళ్లకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై బాలయ్య బాబు సన్నిహితుల దగ్గర స్పందించారని… తాను అస్సలే జగన్ ను కలిసే అవకాశం లేదని కామెంట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా టిక్కెట్ల ధరల తక్కువగా ఉన్న సమయంలోనే తన సినిమా అఖండ సూపర్ హిట్ అయిందని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే హిందూపురం జిల్లా కోసం బాలయ్య బాబు సీఎం జగన్ ను కలుస్తారని గతంలో అన్నారు.
అయితే మంత్రి పేర్ని నాని ఈ విషయంపై స్పందించారు. అఖండ సినిమా విడుదలకు ముందు అఖండ సినిమా నిర్మాతలు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంటక అప్పారావు, మరో ఇద్దరు కాంట్రాక్టర్ల సాయంతో తనకు ఫోన్ చేసి అపాయింట్ మెంట్ అడిగారని చెప్పారు. తాను అపాయింట్ మెంట్ ఇస్తే… విజయవాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ కు వచ్చి కలిశారని… అప్పుడు బాలకృష్ణకు ఫోన్ చేయగా… లిఫ్ట్ చేసి పెట్టేశారని మంత్రి పేర్ని నాని వివరించారు.
ఎందుకలా చేశారని తాను అడగ్గా బాలయ్య బాబు మంచి ముహూర్తం చూసుకొని ఫోన్ చేస్తారని సినిమా నిర్మాతలు చెప్పినట్లు మంత్రి అన్నారు. వాళ్లు అలా చెప్పిన కాసేపటికే బాలకృష్ణ ఫోన్ చేసి తాను.. సీఎంమ కు కలవాలనుకుంటున్నాని, అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరినట్లు నాని వివరించారు. అయితే తాను ఈ విషయాన్ని సీఎంకి చెప్పగా… ఆయన ఇక్కడకు వస్తే బాగోదు.. మీరే ఆయనకు కావాల్సినవి చూసుకోమని చెప్పినట్లు మంత్రి నాని తెలిపారు.