ప్రతి నటుడికి అభిమానులు ఉంటారు. అదే వారి బలం కూడా. కానీ కొన్ని సార్లు వాళ్లే బలహీనతగా మారుతుంటారు. అదే హీరోలకు భవిష్యత్తులో మైనస్ అవుతుంది. ఎలాగంటే.. కెరీర్ ప్రారంభంలో ప్రతి నటుడు ముఖ్యంగా హీరోలు.. మంచి మంచి పాత్రలు ఉన్న చిత్రాల్లో నటిస్తారు. తమ నటనా ప్రతిభతో అభిమానులను సంపాదించుకుంటారు. క్లాస్, మాస్, ఊర మాస్ అంటూ అభిమానులను సంపాదించుకుంటారు. సినిమాల సంఖ్య పెరిగే కొద్దీ ఒక్కో హీరోపై ఒకరమైన అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. క్లాస్ యాక్టర్, మాస్ యాక్టర్ అంటూ ముద్ర పడిపోతూ ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య అంతా ఒక లెవల్ వచ్చాకా… అన్ని రకాల సినిమాలు చేయలేరు ఈ హీరోలు. అభిమానులు స్వీకరిస్తారో లేదో అనే అనుమానం తలెత్తుతుంది. తనను ఇలాంటి పాత్రల్లో చూసి అభిమానులు స్వాగతిస్తారో లేదో అని ప్రయోగాల జోలికి పోరు. దాంతో ఎప్పుడు ఒకే రకమైన పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తారు.
ఇక అభిమానుల సంఖ్య గురించి మాట్లాడాల్సి వస్తే పవన్ కల్యాణ్ తర్వాతే ఎవరైనా. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేరనే చెప్పాలి. పవన్ అంటే బట్టలు చింపుకునే అభిమానులు కోకొల్లలు. ఆయనపైన చిన్న ఈగ కూడా వాలనివ్వరు. కానీ ఇదే ఆయనకు చాలా సార్లు సమస్యగా మారింది తెలిసిందే.
తాజాగా… ఓ అభిమాని అత్యుత్సాహం పవన్‌ను కిందపడేసింది. మత్స్యకారుల కోసం పవన్ చేస్తున్న ర్యాలీలో ఓ వ్యక్తి తన అభిమానాన్ని ఆపుకోలేక పోయాడు. బహిరంగ సభకు హాజరయ్యేందుకు ర్యాలీగా వెళ్తుండగా.. అభిమాని ఆయన కారు పైకి ఎక్కాడు. కౌగిలించుకోవాలని ప్రయత్నించాడు. అయితే.. కొద్దిగా గందరగోళానికి గురి కావడంతో.. పవన్ కల్యాణ్ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో పీకే కు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన కిందపడిపోయిన వెంటనే లేచి నిలబడ్డారు. మళ్లీ సాధారణంగానే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సందర్భాలు పవన్ లైఫ్ లో కోకొల్లలనే చెప్పాలి. ఇలాంటి ఘటనలు చాలా సార్లు జరిగాయి.