కరోనా సోకి స్వల్ప లక్షణాలతో ఐసోలేషన్లోకి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. వైరస్ ను జయించి కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొవిడ్ ను జయించి షూటింగ్ లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు మెగాస్టార్ చిరు. ఈ సందర్భంగా షూటింగ్ లోకేషన్ స్టిల్స్ కూడా షేర్ చేశారు.
పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. మళ్లీ పనిలో పడ్డాను. మళ్లీ యాక్షన్ మొదలైంది. నేను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ మనసారా కృతజ్ఞతలు అని ట్విట్టర్ ద్వారా తెలిపారు మెగస్టార్. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నానన్నారు చిరు.
జనవరి 26న చిరంజీవి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలే ఉండటంతో వైద్యుల సలహాలతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా ఐసోలేషన్‌లో ఉన్నప్పుడే ఆయన తల్లి పుట్టిన రోజు జరుపుకున్నారు. తల్లి పుట్టిన రోజున ప్రత్యక్షంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పి, ఆశీర్వాదం తీసుకోలేకపోతున్నట్లు తన బాధను వ్యక్తం చేశారు.
కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చిన తర్వాత ఆయన నేరుగా పనిలో దిగారు. గాడ్ ఫాదర్ షూటింగ్ లోకేషన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య సినిమా పూర్తి కాగా.. గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలో సెట్స్‌పై ఉన్నాయి.