కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యింది. ఉత్తర భారతంలో ఇప్పటికే భారీ ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. మొదటి వేవ్ మరియు రెండవ వేవ్ సమయంలో పెద్ద ఎత్తున కేసులు నమోదు అయిన విషయం తెల్సిందే. ఈ సమయంలోనే పలువురు రాజకీయ ప్రముఖులు మరియు సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కరోనా బారిన పడ్డట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఇటీవల ఆయన దుబాయిలో కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాడు.
ఆ సమయంలో ఆయన పక్కన వంశీ పైడిపల్లి కుటుంబం కూడా ఉన్నారు. మొత్తం రెండు కుటుంబాలు కలిసి కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. మహేష్ బాబు వదిన గారికి కరోనా పాజిటివ్ అని కొన్ని రోజుల క్రితం నిర్థారణ అయ్యింది. ఆ విషయం మర్చి పోక ముందే ఇప్పుడు మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబుకు సోకింది ఒమిక్రాన్ అయ్యి ఉంటుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రీకరణ కు రెడీ అవుతున్నాడు… ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటాడు అన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యం లో ఇలాంటి ఒక ప్రకటన వినాల్సి వస్తుందని అనుకోలేదు.
మహేష్ బాబు అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆయన వెంటనే కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దేవాలయ్యాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. మహేష్ బాబుకు అంతా మంచి జరగాలని ప్రతి ఒక్కరు ఆశ పడుతున్నారు. మొత్తానికి మహేష్ బాబు కరోనా పాజిటివ్ విషయం జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ చర్చ జరుగుతోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనేది చర్చనీయాంశంగా ఉంది. ఆ తర్వాత రాజమౌళి సినిమా కూడా మహేష్ బాబు చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.