ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా మూడు నాలుగు నెలల క్రితమే ప్రకటించారు. గత మూడు వారాలుగా సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. ఇక సినిమా విడుదల బాకీ అంటూ ఉండగా అనూహ్యంగా ఒమిక్రాన్ కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల వాయిదా పడ్డ నేపథ్యంలో సంక్రాంతికి ఇతర సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. సంక్రాంతికి విజువల్ వండర్ ను మిస్ అయ్యాం అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వారు పెట్టిన ఖర్చు కూడా బూడిదలో పోసిన పన్నీరు అన్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సినిమా విడుదల మరో నాలుగు అయిదు రోజులు మాత్రమే ఉండటంతో భారీ ఎత్తున అభిమానులు హోర్డింగ్ లు చేయించారు. ఎన్టీఆర్ అభిమానులు గుంటూరు లో ఏకంగా అయిదు లక్షల రూపాయలు ఖర్చు చేసి భారీ హోర్డింగ్ ను తయారు చేయించారు. ఇంకా పలు చోట్ల రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు హోర్డింగ్ లు ప్లెక్సీ లు ఇంకా రకరకాల కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు గాను ఖర్చు చేశారు. ఇప్పుడు సినిమా వాయిదా పడటం వల్ల అభిమానులకు అవన్నీ కూడా నష్టాలుగానే చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున అభిమానులు ఖర్చు పెట్టి మరీ సినిమాకు స్వాగతం పలకాలని అనుకుంటున్న సమయంలో ఇలా జరగడం విచారకరం. ముందు ముందు అయినా సినిమా సాఫీగా విడుదల అవ్వాలని కోరుకుంటున్నారు.
ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి నటించిన ఈ అతి పెద్ద విజువల్ వండర్ మల్టీ స్టారర్ మూవీ కోసం జక్కన్న ఏకంగా 400 కోట్ల వరకు ఖర్చు పెట్టడని తెలుస్తోంది. సినిమా ను కొన్ని నెలల క్రితమే అమ్మేశారు. నిర్మాత దానయ్య కు ఇప్పటికే లాభాలు కూడా వచ్చాయి అనేది టాక్. కనుక నిర్మాతకు నష్టం లేదు కాని బయ్యర్లు సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం జక్కన్న సినిమా ను కొంటే రూపాయికి రెండు రూపాయలు రావడం ఖాయం. కనుక ఇప్పుడు కాకున్నా ఎప్పుడు విడుదల అయితే అప్పుడే సినిమా భారీగా వసూళ్లను దక్కించుకుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బయ్యర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.