ఒక హీరో చేయాల్సిన సినిమాలు ఒక హీరో చేయడం ఇండస్ర్టీలో సర్వ సాధారణం. ఇలా మూవీస్ మిస్ కావడానికి ఎన్నో కారణాలుంటాయి. ఒక్కో సారి చిన్న చిన్న కారణాలతో మిస్ అయిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఆ సమయంలో మొదట సినిమా కథ విన్న హీరోలు కాస్తంత బాధ పడ్డా తర్వాత అన్నీ మర్చిపోతుంటారు. ఇలా వేరే హీరోలు చేయాల్సిన సినిమాలు చేసి స్టార్లుగా ఎదిగినవారు కూడా ఇండస్ర్టీలో ఉన్నారు.
అదే విధంగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఢిల్లీ బెల్లీ గురించి కూడా ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ మూవీని అభినయ్ డియో అనే దర్శకుడు రూపొందించాడు. ఈ మూవీ మొదట ఓ స్టార్ హీరోకు వినిపించగా… కథ నచ్చినప్పటికీ ఈ మూవీ చేస్తే… తాను తన తల్లిదండ్రుల ముందు చులకనయిపోతానని భావించి చేయలేదట. ఢిల్లీ బెల్లీ కథను విన్న నిర్మాత అమీర్ ఖాన్ దర్శకుడు అభినయ్ ని ఈ కథను అప్పటి స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ కు చెప్పమని పంపించాడట.
దాంతో దర్శకుడు అభినయ్ రణ్ బీర్ కపూర్ కు ఈ కథ మొత్తం వినిపించగా… కథ తనకు నచ్చింది కానీ ఈ సినిమా చేస్తే తాను తన తల్లిదండ్రుల వద్ద ముఖం ఎత్తుకోలేనని చెప్పి … తప్పుకున్నాడు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ మూవీలో విపరీతంగా బూతు డైలాగులు ఉంటాయి. అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ మూవీ తనకు కరెక్ట్ కాదని రణ్ బీర్ కపూర్ భావించి… వదిలేశాడు. అనంతరం ఈ మూవీ మరో ఇద్దరు హీరోల దగ్గరికి వెళ్లినా… ప్రయోజనం లేకపోవడంతో చివరికి అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు భారీ విజయాన్ని కట్టబెట్టారు.