వరుస విజయాలతో ఫుల్ స్పీడ్ లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్..ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ శివ డైరెక్షన్లో ‘అన్నత్తే’ అనే సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ..తెలుగు లో మెగా స్టార్ టైటిల్ అన్నయ్య మూవీ తో విడుదల కాబోతుంది.
ఈ మూవీ షూటింగ్ సోమవారం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలు కానుంది. ఇందుకోసం రజినీ ఆదివారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సినిమాలో రజినీ సరసన నయనతార నటిస్తోంది. ఈ షెడ్యూల్ లో నటించే నటీనటులు, యూనిట్ సభ్యులందరూ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇందులో కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా, ప్రకాష్‌రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గతేడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కరోనా ముందు వరకు చకచకా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కానుకగా తీసుకురావాలని చిత్ర నిర్మాతలు భావించారు. అయితే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడింది.
రెండు నెలల కిందటే సినిమా షూటింగ్స్‌కు అనుమతులు వచ్చినా.. కరోనా విజృంభన… రజనీ వయస్సు , ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని వెంటనే షూటింగ్ ప్రారంభించలేదు. ప్రస్తుతం రేపో మాపో కరోనా వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం, దగ్గర పడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్ ను మొదలుపెట్టారు. దీని కోసం చైన్నై నుంచి హైదరాబాద్‌కి ప్రత్యేక ఫ్లైట్‌లో రజనీ వచ్చారు. జనవరిలో కొత్త పార్టీ అంటూ రజనీకాంత్ తెలిపినప్పటి నుంచి.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చలు ఇలా నడుస్తుండగానే.. మళ్లీ తలైవా సినిమాల వైపు దృష్టి పెట్టడం విశేషం.